మంచిర్యాల జిల్లా సీసీసీ విద్యానగర్ లోని శ్రీకృష్ణవేణి హైస్కూల్లో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
పిల్లలే దేశ భవిష్యత్తు
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ దేవన్న మాట్లాడుతూ.. పిల్లలే దేశ భవిష్యత్తు అని, విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణ, సంస్కారం, మానవత్వం, ఆత్మవిశ్వాసాన్ని అలవర్చుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు పిల్లలపై ఒత్తిడి చేయకుండా వారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని కోరారు.
సమప్రాధాన్యత
విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలకు పాఠశాలలో సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమన్వయంతోనే విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదుగుతారని పేర్కొన్నారు. పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల ప్రగతికి సహకరిస్తున్న తల్లిదండ్రులను ప్రత్యేకంగా అభినందించి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






