హజీపూర్, 16 November
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అధికారులను ఆదేశించారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పోలీస్ అధికారులను ఆదేశించారు. ఇటీవల మంచిర్యాల జోన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి-63పై గుడిపేట పెట్రోల్ పంపు సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరు, దానికి దారితీసిన పరిస్థితులు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఎస్ఐ కిరణ్ కుమార్ ను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ, ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి, అవసరమైన హెచ్చరిక బోర్డులు, రేడియం సూచికలు, వేగ నియంత్రణ చర్యలు ఏర్పాటు చేసేలా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా అవగాహన కల్పించాలని, అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, ప్రమాదకర ఓవర్ టేకింగ్ లను అరికట్టేందుకు నిరంతరం వాహన తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.
చలికాలం నేపథ్యంలో, రాత్రి వేళల్లో, తెల్లవారుజామున పొగమంచు కారణంగా వాహనదారులు మరింత అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు. ముఖ్యంగా జాతీయ రహదారులపై ప్రమాదాలకు తావులేకుండా పోలీసు నిఘా, పెట్రోలింగ్ ను ముమ్మరం చేయాలని స్పష్టం చేశారు.


