మందమర్రి, 13 November
మంచిర్యాల జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో, శుక్రవారం మందమర్రి మండలంలోని పలు పాఠశాలల్లో మొబైల్ వ్యాన్ ద్వారా న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా లఘు చిత్రాలను ప్రదర్శించి, విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు.
విద్యార్థులకు చిన్న వయస్సు నుంచే చట్టాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. పొన్నారం పాఠశాల, జెడ్పీఎస్ఎస్ బాలుర పాఠశాల, బాలికల పాఠశాల ( ), తవక్కల్ పాఠశాల (రామకృష్ణాపూర్), మోడల్ స్కూల్, కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు.
మొబైల్ వ్యాన్ ద్వారా ప్రదర్శించిన లఘు చిత్రాలు విద్యార్థులను ఆకట్టుకోగా, వాటి ద్వారా చట్టాలపై పలు అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ డిఫెన్స్ కౌన్సిల్ ఎం.డి. సంధాని, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఆర్.ఆర్. రాములు, ఎస్. సదయ్య, డీఎల్ఎస్ సిబ్బంది, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

