మంచిర్యాల (మన సమాజం ఎక్ష్ప్రెస్స్) నవంబర్ 10
మంచిర్యాల జిల్లాలో పదో తరగతి పరీక్ష ఫీజుల పేరుతో విద్యార్థుల నుంచి అధిక మొత్తాలు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి పరీక్ష ఫీజును రూ.125గా నిర్ణయించగా, జిల్లాలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థుల నుంచి రూ.800 నుంచి రూ.1,000 వరకు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుకు మించి వసూళ్లు చేయడం వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం పడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని, అదనంగా వసూలు చేసిన మొత్తాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు తిరిగి చెల్లించేలా చూడాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు చిప్పకుర్తి శ్రీనివాస్, పూరెళ్ల నీతిష్, రేగుంట క్రాంతి కుమార్, బచ్చల జశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.

