మందమర్రి పట్టణంలో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులపై పోలీసులు దాడులు నిర్వహించారు. శుక్రవారం వివిధ కాలనీల్లో చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో ఐదు బెల్ట్ షాపుల నుంచి రూ.75,620 విలువైన 101.5 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు పట్టణ సీఐ రమేష్ తెలిపారు.
అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఐదుగురు నిర్వాహకులపై కేసులు నమోదు చేసి, తహశీల్దార్ ఎదుట బైండోవర్ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
అంగడి బజార్ ప్రాంతంలో న్యూసెన్స్ సృష్టించిన మరో ఐదుగురిపై కూడా కేసులు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
పట్టణంలో అక్రమ మద్యం విక్రయాలు, అసాంఘిక కార్యకలాపాలపై ప్రజలు పోలీసులకు సమాచారం అందించాలని, డయల్ 100కు ఫోన్ చేయాలని సీఐ కోరారు.
ఈ దాడుల్లో ఎస్సై జీ నరేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.






