మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం పరిధిలోని పలు గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను సమర్థవంతంగా నిర్వహించాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం మండలంలోని సారంగపల్లి, ఆదిలపేట, పొన్నారం గ్రామపంచాయతీల పరిధిలో వీబీజీ రామ్ జీ పథకం కింద కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సారంగపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన మురుగు కాలువలు, ఇంకుడు గుంతలు, కమ్యూనిటీ సోక్ పిట్, సీసీ వర్క్ సైట్ పనులను, అలాగే ఆదిల్ పేట గ్రామపంచాయతీలోని పీటీ వర్క్ సైట్ ను ఆయన పరిశీలించారు. మూడు గ్రామ పంచాయతీల పరిధిలో చేపడుతున్న ఇంకుడు గుంతలు, వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలు, బోర్ వేల్ రీఛార్జ్ పనులను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆసరా పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు వంటి సంక్షేమ పథకాల అమలు తీరును సమీక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకాల నిర్వహణను ఆయన తనిఖీ చేశారు.
అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యను అందించాలని ఆయన సూచించారు. గ్రామాల్లోని వీఓ భవనాలు, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి, వాటి పనితీరును పరిశీలించారు. రానున్న రోజుల్లో ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని నీటి సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన తెలిపారు. గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సర్పంచులను, పంచాయతీ కార్యదర్శులను ఆయన ఆదేశించారు. భూగర్భ జలాల పెంపు, నీటి వనరుల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా శాఖల ఏఈలు, ఉపాధి హామీ ఏపీవో, ఈసీ, టీఏ, పంచాయతీ కార్యదర్శులు, ఆయా గ్రామాల సర్పంచులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


